ఓబీసీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి
హనుమకొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(Acharya Konda Laxman Bapuji) 14వ వర్ధంతిని హనుమకొండ రాంనగర్ లోని బీసీ భవన్ లో ఓబీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీసీ నేతలు, వివిధ కులసంఘాల ప్రతినిధులతో కలిసి ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం బాపూజీ కృషి చేశాడని, ఓబిసిప్రజా ప్రయోజనాల కోసం పదవులను సైతం త్యాగం చేసిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, స్వాతంత్ర్య సమరయోధుడని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.
ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చూపిన నిబద్ధత, ధైర్యం, త్యాగం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. మలిదశ ఉద్యమంలో తన నివాసాన్ని తెలంగాణ ఉద్యమం కోసం కేటాయించారని, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.