ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు బూస్ట్

13-09-2026 | 05:10am
  1. జేయూఏతో దేశ రక్షణ సామర్థ్యాలు బలోపేతం
  2. ఉత్తర తెలంగాణకు మెరుగైన కనెక్టివిటీ
  3. మిషన్ మోడల్‌లో ప్రాజెక్టు అమలు  
  4. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
  5. ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్, రామ్మోహన్‌నాయుడుతో భేటీ 
  6. డీపీఆర్, మాస్టర్‌ప్లాన్‌పై సమీక్ష 

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు(Airport in Adilabad) ఏర్పాటుకు కీలక ముందడుగు పడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ, పౌరవిమానయాన శాఖలు(Ministries of Defence and Civil Aviation), తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) నుంచి ఒక్కో నోడల్ ఆఫీసర్‌ను వచ్చే వారంలోగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.  శనివారం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు(K Rammohan Naidu)తో కలిసి ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు(Adilabad Airport Project) పురోగతిపై కిషన్‌రెడ్డి(Kishan Reddy) సమీక్ష నిర్వహించారు.

జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్టు(జేయూఏ)కు సంబంధించిన డిటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్), మాస్టర్‌ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉత్తర తెలంగాణ కనెక్టివిటీ విషయం, దేశ రక్షణపరంగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు అవసరాన్ని రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించామని, రీజనల్  కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు  పేర్కొన్నారు. ఇందుకు రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించి   హామీ ఇచ్చారన్నారు.

అదనంగా 1,500 ఎకరాల భూ సేకరణ

రక్షణ, పౌర విమానయాన అధికారులు  ఈ ఏడాది ఏప్రిల్ 17న ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఆదిలాబాద్‌లో స్థలం పరిశీలించారని, 2.75 కిలోమీటర్ల రన్ వే నిర్మాణం అవసరమని నిర్ణయించినట్టు మంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఐఏఎఫ్ వద్ద 369.45 ఎకరాలకు తోడు అదనంగా మరో 1,500 ఎకరాల భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్, విజిటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్,  ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్స్,  మెయింటేనెన్స్ ఇన్‌ఫ్రా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు