జాతీయ ఆయుర్వేద దినోత్సవం రోజే తాళం వేసి ఉన్న ఆయుర్వేద వైద్యశాల

23-09-2026 | 06:31pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): జాతీయ ఆయుర్వేద దినోత్సవం(National Ayurveda Day) సందర్భంగా ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. అయితే జాతీయ ఆయుర్వేద దినోత్సవం రోజే ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు తాళం వేసి ఉండటం విచారకరమని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆళవందార్ వేణు మాధవ్ మహమ్మద్ రఫీక్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో విశ్వాసం ఉందని, ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, మోకాళ్ల నొప్పులు, కొన్ని చర్మ వ్యాధులు, పక్షవాతం వంటి సమస్యలకు ఆయుర్వేద చికిత్స కోసం అనేక మంది ప్రజలు ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారని వారు తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలు నిర్ణీత సమయాల్లో అందుబాటులో ఉండటం అత్యంత అవసరమన్నారు.

ఒకవైపు ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, మరోవైపు ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మూసి ఉండటం పట్ల అధికారులు దృష్టి సారించాలి అని వారు కోరారు.

ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది క్రమం తప్పకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యశాల పనితీరును సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నిరంతరాయంగా ఆయుర్వేద వైద్య సేవలు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆళ వందార్ వేణు మాధవ్, మహమ్మద్ రఫీక్ అహ్మద్ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు