పచ్చదనం ముసుగులో విషపు చెట్లు..!

23-09-2026 | 06:43pm

పల్లె ప్రకృతి వనాల్లోనే ప్రాణాంతక కోనో చెట్లు

నిషేధం ఉన్నా అమలుకు నోచుకోని ఉత్తర్వులు - ప్రజారోగ్యంపై తీవ్ర ఆందోళన

బెజ్జూర్ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనాలే ఇప్పుడు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులకు పక్కనే  బెజ్జూర్ మండలంలోని సలగుపల్లి, ముంజంపల్లి, పలు పల్లె ప్రకృతి వనాలలో ఈ చెట్లు పెద్దవిగా పెరిగాయి. పచ్చగా కనిపించే ఈ చెట్లు నిజానికి ప్రమాదకరమైన కోనోకార్పస్ (Conocarpus Erectus) జాతికి చెందినవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ చెట్లను అమెరికా, ఆఫ్రికా దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. త్వరగా పెరుగుతాయి, నీళ్లు తక్కువ అనే ఉద్దేశంతో హరితహారంలో లక్షల్లో నాటారు. కానీ వీటి తీవ్రత తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం 2022 జూలై 25న జీవో నెం. 18 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించింది. సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(Central Empowered Committee) కూడా దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

కోనో చెట్ల వల్ల కలిగే 6 ప్రధాన అనర్థాలు:

1. ఆరోగ్యానికి పెనుముప్పు: ఈ చెట్లు ఏడాదికి రెండుసార్లు (ముఖ్యంగా చలికాలంలో) భారీగా పుప్పొడి రేణువులను గాలిలోకి వదులుతాయి. దీనివల్ల ఆస్తమా, దీర్ఘకాలిక దగ్గు, జలుబు, చర్మ అలెర్జీలు, కంటి మంటలు వస్తాయి. పిల్లలు, వృద్ధులకు ఇది మరింత ప్రమాదకరం అని నిపుణులు తెలుపుతున్నారు.

2. భూగర్భ జలాల దోపిడీ: ఒక కోనో చెట్టు రోజుకు 200 నుండి 300 లీటర్ల నీటిని పీల్చేస్తుంది. గుజరాత్ లోని వడోదరలో 24 వేల చెట్ల వల్ల రోజుకు లక్ష లీటర్ల నీరు ఆవిరైపోయిందని తేలింది.మన తెలంగాణ లాంటి నీటి కొరత ఉన్న ప్రాంతానికి ఇది పెద్ద దెబ్బ అని తెలుపుతున్నారు.

3. పైప్ లైన్లు, రోడ్లు ధ్వంసం: వీటి వేర్లు నీటి కోసం 50 మీటర్ల లోతు వరకు వ్యాపిస్తాయి. దీంతో తాగునీటి పైప్ లైన్లు, డ్రైనేజీలు, టెలిఫోన్ కేబుల్స్, సీసీ రోడ్లు, ఇళ్ల పునాదులు పగిలిపోతున్నాయి.

4. పర్యావరణ విధ్వంసం: ఈ చెట్లపై ఒక్క పక్షి కూడా గూడు కట్టదు. దీని ఆకులను మేక, ఆవు ఏ జంతువు తినదు. ఇది నేలలోకి ఆలెలోపతిక్ అనే విష రసాయనాన్ని వదిలి పక్కన వేప, మర్రి వంటి స్థానిక మొక్కలు పెరగకుండా చేస్తుంది. దీన్ని గ్రీన్ డెసర్ట్' (పచ్చని ఎడారి) అంటారు.

5. ఆక్సిజన్ బదులు కార్బన్: సాధారణ చెట్లు ఆక్సిజన్ ఇస్తే, ఈ చెట్లు చాలా తక్కువ ఆక్సిజన్ ఇచ్చి, రాత్రి పూట కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా వదులుతాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్వయంగా చెప్పారు.

6. అగ్ని ప్రమాదం: దీని కలప చాలా పొడిగా, తేలికగా మండే గుణం కలిగి ఉంటుంది. వేసవిలో చిన్న నిప్పురవ్వకే పెద్ద అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గతంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రాణాంతక కోనో చెట్లు తొలగించాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఆ చెట్లను తొలగించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రజల డిమాండ్ ఏంటి..?

పల్లె ప్రకృతి వనం అంటే గ్రామస్తులు సేదతీరే ప్రదేశం. అలాంటి చోటే విషపు చెట్లు ఉండటం దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అటవీ, పంచాయతీరాజ్ అధికారులు స్పందించి ఈ చెట్లను వేళ్లతో సహా తొలగించి, వాటి స్థానంలో ప్రజలకు, పక్షులకు ఉపయోగపడే వేప, రావి, మర్రి, కానుగ, చింత వంటి స్థానిక జాతి మొక్కలు నాటాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు