ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా బాట లక్ష్యం

08-09-2026 | 09:53pm

విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డైరెక్టర్ కమర్షియల్ చక్రపాణి

ఉప్పల్,(విజయక్రాంతి): ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రజా బాట కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డైరెక్టర్ కమర్షియల్ శ్రీ చక్రపాణి(Director Commercial Chakrapani) అన్నారు. హబ్సిగూడ సెక్షన్ పరిధిలోని స్నేహపురి కాలనీ, స్ట్రీట్ నంబర్–8లో మంగళవారం నిర్వహించిన ప్రజా బాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను నేరుగా కలిసి విద్యుత్ సరఫరా, ఇతర విద్యుత్ సంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ శ్రీ రమేష్, ఎస్‌ఈ శ్రీ వెంకన్న, డీఈ శ్రీ సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చక్రపాణి సూచించారు. ఉత్సవాల ఏర్పాట్లలో విద్యుత్ వైర్లు, స్తంభాలు, విద్యుత్ పరికరాలకు తగిన దూరం పాటించాలని, విద్యుత్ ప్రమాదాలకు ఏమాత్రం అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. విద్యుత్ సంబంధిత పనులను అనుభవజ్ఞులైన సిబ్బందితోనే చేయించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలను చూపిస్తూ మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని చక్రపాణి తెలిపారు. “భద్రతే ప్రథమం.. విద్యుత్‌ను సురక్షితంగా వినియోగిద్దాం” అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు