దానంకు షాక్
- సుప్రీంకోర్టులో ‘అనర్హత’పై పిటిషన్ డిస్మిస్
- మరో పార్టీ బీ-ఫాంపై పోటీ చేయడం ఫిరాయింపే
- న్యాయ సమీక్షకు లోబడే స్పీకర్ నిర్ణయం ఉండాలి
- చర్యలు తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే
- హైకోర్టు తీర్పులో జోక్యానికి సుప్రీం ధర్మాసనం నిరాకరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): దానం నాగేందర్(Danam Nagender)కు సుప్రీంకోర్టు(Supreme Court) లోనూ చుక్కెదురైంది. ఉపశమనం దక్కుతుందని భావించిన ఆయనకు షాక్ తగి లింది. తన అనర్హత వేటును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(CJI Justice Surya Kant) నేతృత్వం లోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా, అధికారికంగా రాజీనామా పత్రం ఇవ్వకపోయినా, మరో రాజకీయ పార్టీ బీ-ఫాంపై నామినేషన్ వేసి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీని వీడినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదవిలో కొనసాగుతూ పార్టీ ఫిరాయింపునకు పా ల్పడటం రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక నిబంధనల పరిధిలోకి వస్తుందని ధర్మాసనం పేర్కొంది. స్పీకర్ నిర్ణయం కూ డా న్యాయసమీక్షకు లోబడి ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది.
ఒక ఎమ్మెల్యే మరో పార్టీ బీ-ఫాంపై పోటీ చేసినట్లు సుస్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు స్పీకర్ చర్య తీసుకోకపోవడం రాజ్యాంగపరమైన ప్రశ్నలకు దారి తీస్తుందని, ఇది కూడా రాజ్యాంగ ఉల్లంఘనే అని ధర్మాసనం అభిప్రాయపడింది. అనర్హత వేటు నేపథ్యంలో మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. విచారణ సం దర్భంగా దానం నాగేందర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ‘ఘర్ వాపసీ’ అంశా న్ని ప్రస్తావించారు. దానం తిరిగి తన పాత పార్టీలో చేరారని, పార్టీ కార్యక్రమాల్లో పా ల్గొంటున్నారని, ఆయనపై పార్టీ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో అనర్హత వేటు కొనసాగించాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే పార్టీ సభ్యత్వాన్ని తిరిగి పొం దడం, చట్టసభ సభ్యత్వాన్ని కొనసాగించడం రెండూ వేర్వేరు అంశాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తిరిగి పార్టీలో చేరినంత మా త్రాన ఎమ్మెల్యేగా ఎదురయ్యే అనర్హత తొలగిపోదని పేర్కొంది. దీంతో దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
తీర్పును స్వాగతిస్తున్నా: దానం
తన అనర్హత విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు దానం నాగేందర్ తెలిపారు. తన పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయపరంగా పోరాడటంలో తప్పులేదని, చట్టపరమైన అన్ని అవకాశాల ను వినియోగించుకున్నానని చెప్పారు. పదో షెడ్యూల్ ప్రకారం తనకు కొంత ఊరట లభిస్తుందని అనుకున్నా.. తీర్పు మరో విధంగా వచ్చిందని నిరాశ చెందారు. అయితే ప్రజాక్షేత్రంలో తనకు బలముందని, ప్రజల తీర్పు ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పే ర్కొన్నారు.
ఎంపీగా పోటీ చేసిన సమయంలోనే ఈ పరిణామాన్ని ఊహించానని, చివ రకు అదే జరిగిందన్నారు. తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఖైరతాబాద్ ప్రజలతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు సేవ చే శానని చెప్పారు. తాను ఎవరో ఖైరతాబాద్ ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. ఉప ఎన్నికలో పోటీ చేసే అంశంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారని తెలిపారు.
గతంలో ఖైరతాబాద్ నుంచి మూడుసార్లు గెలిచానని, ఒక సారి ఉప ఎన్నికలో కేవలం 1,600 ఓట్ల తే డాతో ఓడిపోయానని గుర్తుచేశారు. ప్రసు తం పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలి తాలే ఖైరతాబాద్‌లోనూ పునరావృతమవుతాయని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకు లు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని, ఉప ఎన్నికలో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
‘ఖైరతాబాద్ దా నం నాగేందర్ అడ్డా. కలిసి పనిచేస్తాం.. తప్పకుండా గెలుస్తాం’ అని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కాంగ్రెస్‌లో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌పై ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు విషయంలో హైకోర్టు తీర్పు వెలువరించిం ది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సు ప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో ఖైరతాబాద్ అసెం బ్లీ స్థానం ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది.