జాతీయ బాస్కెట్ బాల్ పోటీలకు భవిష్య ఎంపిక
జగిత్యాల, నవంబర్ 25 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలోని అకాడమిక్ హైట్స్ పాఠశాలలో చదువుతున్న భవిష్య జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ (Basketball) పోటీలకు ఎంపికైంది. ఎస్‌జీఎఫ్‌ఐ (SGFI) ఆధ్వర్యంలో జరిగే అండర్-14 బాలికల విభాగంలో తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జట్టు తరఫున ఆడిన భవిష్య అత్యుత్తమ ప్రతిభ (Performance) కనబరిచింది. దీంతో డిసెంబర్‌లో తమిళనాడులోని కోయంబత్తూరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ జట్టుకు ఎంపికైంది.
ఈ సందర్భంగా భవిష్యను, ఆమె విజయం కోసం నిరంతరం శ్రమించిన తల్లిదండ్రులు, పీఈటీలను పాఠశాల యాజమాన్యం అభినందించింది. జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి జగిత్యాల పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు పాల్గొన్నారు.