టీఆర్ఎస్ పుట్టకముందు నీళ్ల గురించి ఎవరు మాట్లాడారు?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, కృష్ణా జలాల హక్కుల విషయంలో బీఆర్ఎస్ పోరాటాన్ని గుర్తుచేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు.
టీఆర్ఎస్ పార్టీ (TRS Party) పుట్టకముందు తెలంగాణ నీళ్ల గురించి ఎవరు మాట్లాడారని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ముందు ఆంధ్రా నాయకుల ముందు తెలంగాణ నాయకులు కట్టుబానిసల్లా బతకలేదా? అని నిలదీశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన సమయంలో రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కేసీఆర్ చేసిన తప్పా? అని నిలదీశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా (Krishna Water Rights) దక్కేందుకు సెక్షన్ 3 తీసుకురావాలని కోరడం తప్పా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తప్పు అన్నట్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు, సాగునీటి హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడిందని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆంధ్రా నాయకులు ఇచ్చిన నోట్ల కట్టల వ్యవహారంలో రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని విస్మరించి మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.