ఎల్‌నినో పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ తోటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
రైతులకు సూచనలు చేసిన ఉద్యాన అధికారి అర్చన
ధర్మపురి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయిల్‌పామ్ రైతులు డ్రిప్ ఇరిగేషన్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ, సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వాడాలని ధర్మపురి డివిజన్ ఉద్యాన అధికారి అర్చన(Horticulture Officer Archana) సూచించారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ, గోపులపూర్ శివారులోని కేతిరెడ్డి లింగారెడ్డి ఆయిల్‌పామ్ తోటను ఆమె సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు.
మూడేళ్ల వయస్సున్న ఆయిల్‌పామ్ తోటల్లో డ్రిప్ పైపులను చెట్లకు మూడు అడుగుల దూరంలో ఉంచాలని, డ్రిప్‌తోపాటు అందించిన మైక్రోజెట్‌లను తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. వీటి ద్వారా నేలలో తేమశాతం నిలిచి చెట్లకు తగినంత నీరు అందుతుందని పేర్కొన్నారు.
ఎరువుల వినియోగంపై సూచనలు
ఒక ఎకరానికి 400 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, ఒక కిలో బోరాన్, 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 10 కిలోల ఎంఓపీ సిఫారసు చేసిన మోతాదులో వినియోగించాలని సూచించారు. ముందుగా మెగ్నీషియం సల్ఫేట్ వేసిన 10 రోజుల తర్వాత బోరాన్, మరో 10 రోజుల అనంతరం మిగతా ఎరువులు వేయాలని తెలిపారు. వేడిగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఆయిల్‌పామ్ తోటల్లో సరుగుడు వంటి చెట్లను నాటుకోవచ్చని చెప్పారు.
బుగ్గారం మండలంలో ఇప్పటివరకు ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం, రైతుల వివరాలను సమీక్షిస్తూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు మెలకువలు పాటించి ఆశాజనకమైన దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి వంశీకృష్ణ, మర్రిపెల్లి రవీందర్‌రెడ్డి, కొమ్మినేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.