పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలి
మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలోత్ చరణ్ సింగ్
నల్లబెల్లి,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
2027 మార్చిలో ఖాళీ కానున్న గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేటి నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్థాయి నుంచి యూత్ కాంగ్రెస్ను బలోపేతం చేస్తూ, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో పగడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.
దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడైన సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతి రావు, జిల్లా కార్యదర్శి చిట్యాల చిరుపతి రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్ చార్ల శివారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఇస్తారీ శేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.