ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదాం.. జ్యూట్ బ్యాగులను ప్రోత్సహిద్దాం

01-11-2026 | 05:42pm

జగిత్యాల, నవంబర్ 01 (విజయక్రాంతి): ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కౌన్సిలర్ బోయిన్పల్లి ప్రశాంత్ రావు(Boinpally Prashanth Rao) పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నివారణ ఉద్యమకర్త అడ్వకేట్ నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ధరూర్ క్యాంప్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామాలయం గ్రౌండ్ వద్ద జ్యూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్ల వినియోగం పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోందని, భూమి, నీరు, జీవరాశులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఒకసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం జ్యూట్ బ్యాగులను పంపిణీ చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ధరూర్ క్యాంప్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గాడిపల్లి చంద్రశేఖర్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సభ్యులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు