పల్లా చొరవతో మాతా శిశు ఆసుపత్రి రహదారికి త్వరలో మరమ్మతులు!
జనగామ, అక్టోబర్ 25 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ సమీపంలోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Dr. Palla Rajeshwar Reddy) ఆదివారం స్వయంగా రహదారిని పరిశీలించారు.
ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే జాతీయ రహదారుల శాఖ డీఈతో ఫోన్ లో మాట్లాడారు. రోగులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దీనిపై స్పందించిన డీఈ వారం రోజుల్లో పనులు ప్రారంభించి 15 రోజుల్లో బీటీ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.