​సివిల్ రైట్స్ డేను నిబంధనల ప్రకారం నిర్వహించాలి

02-11-2026 | 04:11pm

మహాదేవపూర్,(విజయక్రాంతి): ​​ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ, సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సివిల్ రైట్స్ డే’ (Civil Rights Day)ను మండలంలో నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం(All India Ambedkar Youth Association) మండల అధ్యక్షులు మెరుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఎంపీడీవో కు సంఘం తరఫున వినతిపత్రం అందజేశారు.

​ఈ సందర్భంగా మెరుగు లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో రొటేషన్ పద్ధతి పాటిస్తూ సమాన ప్రాధాన్యంతో సివిల్ రైట్స్ డేను నిర్వహించాల్సి ఉంటుందనిఆయన స్పష్టం చేశారు. మండలంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ కార్యక్రమం జరగని గ్రామాలు ఎన్నో ఉండగా, కేవలం రెండు నెలల క్రితమే నిర్వహించిన చండ్రుపల్లి గ్రామంలోనే మళ్లీ రెండోసారి నిర్వహించడం వల్ల ఇతర గ్రామాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని లక్ష్మన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

​పౌర హక్కుల దినోత్సవ ఆశయం నెరవేరాలంటే క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్, సంక్షేమ, వైద్య, విద్యా శాఖలతో పాటు సంబంధిత అన్ని శాఖల అధికారులు విధిగా హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు కేవలం నామమాత్రపు హాజరుతో సరిపెట్టకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే అట్టడుగు వర్గాల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు.

​ఉన్నతాధికారులు స్పందించి, మండలంలో మిగిలిన గ్రామాల్లో ప్రాధాన్యతా క్రమంలో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని, రాబోయే సమావేశాలకు మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఎంపీడీవోను కోరారు. అట్టడుగు వర్గాల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ మరియు సంక్షేమం కోసం తమ సంఘం ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు

మరిన్ని వార్తలు