హైదరాబాద్‌లో అమిత్ షా.. కాంగ్రెస్‌పై ఫైర్!
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) హైదరాబాద్ పర్యటన ఆసక్తికరంగా మారింది. నగరంలో నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఎదురైన పరాజయాలతో కాంగ్రెస్ పార్టీ(Congress party) ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి అధికారమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించారు. వరుస ఎన్నికల ఓటములతో నిరాశలో ఉన్న కాంగ్రెస్.. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలు, కుటిల ప్రయత్నాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం' మహా పాదయాత్రలో పాల్గొననున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తన సందేశం ద్వారా పిలుపునిచ్చారు.
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న షా
మహా పాదయాత్రకు ముందు అమిత్ షా హైదరాబాద్‌లోని చారిత్రక శ్రీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ దర్శనం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ప్రజలందరూ సుఖశాంతులతో, సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. ఒకవైపు కాంగ్రెస్‌పై రాజకీయ విమర్శలు.. మరోవైపు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఇలా అమిత్ షా హైదరాబాద్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మహా పాదయాత్రలో ఆయన చేసే ప్రసంగం, వెల్లడించే రాజకీయ అంశాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.