ఓటు హక్కు పరిరక్షణకు పారదర్శకత అవసరం
అఖిలపక్షం నాయకుల డిమాండ్
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 02 (విజయక్రాంతి): ఓటు హక్కు పరిరక్షణకు పారదర్శకత అవసరమని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఓటరు జాబితా సవరణలు, ఫామ్ 6లో జరిగిన మార్పులు, ఓటర్ డేటా నిర్వహణ తదితర అంశాలపై భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అఖిలపక్షం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా ఎన్నికల వ్యవస్థ పనిచేయాలని అన్నారు.
ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో ప్రజలకు, రాజకీయ పార్టీలకు స్పష్టమైన సమాచారం అందించాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. టీజేఎస్ నాయకులు కిరణ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే ఓటరు డేటా నిర్వహణలో పూర్తి పారదర్శకత అవసరమని అన్నారు. సీపీఎం నాయకులు గుర్రం దేవేందర్ మాట్లాడుతూ ఓటర్ జాబితా అనేది ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు.
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా, అనర్హులైన పేర్లను నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, పీసీసీ సభ్యులు చల్లూరి మధు తదితరులు పాల్గొన్నారు.