కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు గుర్తింపు ఏదీ?

19-10-2026 | 08:51pm

కాంగ్రెస్‌లో ఇదేనా న్యాయం.. కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి నష్టమే: అహ్మద్ ఖాన్

జైనూర్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి, ఎండనకా వాననకా నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టి, పదవుల విషయంలో ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని జైనూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ ఖాన్(Ahmed Khan) ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

తన సొంత అత్తమ్మను కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా మెజారిటీతో గెలిపించానని తెలిపారు. పార్టీ అధికారంలో లేని సమయంలో జెండా మోసి, పార్టీ బలోపేతానికి కృషి చేసిన కార్యకర్తలకు ప్రస్తుతం తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అవసరమైనప్పుడు కార్యకర్తలను ఉపయోగించుకుని, ఆ తర్వాత విస్మరించడం సరైన పద్ధతి కాదన్నారు.

పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు తగిన బాధ్యతలు, గౌరవం కల్పించాలని, పదవులు వ్యక్తిగత ఆస్తులు కావని, కార్యకర్తల కష్టానికి తగిన గుర్తింపు దక్కాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నత నాయకత్వం స్పందించి క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు గౌరవం లభించకపోతే భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేసేవారికి ప్రోత్సాహం తగ్గుతుందని, ఇది పార్టీ బలోపేతంపై ప్రభావం చూపుతుందని అహ్మద్ ఖాన్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు