గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి పుస్తక భాండాగారం
ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో గ్రామానికి చెందిన వివిధ శాఖల విశ్రాంత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ, ఆర్మీ ఉద్యోగుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి(MLA Pocharam Srinivas Reddy), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ సంధ్య రాజ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ గ్రామంలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించిన పలువురు తమ స్వగ్రామ విద్యార్థులకు విద్యావకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గ్రంథాలయం ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల సన్నద్ధతకు, విజ్ఞానాభివృద్ధికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది.గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని చదువులో రాణించేందుకు గ్రంథాలయం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వాములైన విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ, ఆర్మీ ఉద్యోగుల సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామస్తులు యువకులు తదితరులు ఉన్నారు.