వానాకాలం ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెలాఖరులోగా కొనుగోలు కేంద్రాల మ్యాపింగ్ పూర్తి చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి,(విజయక్రాంతి): వానాకాలం ధాన్యం కొనుగోలు(grain purchasing) ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీలో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలు, గోదాములు, రైస్ మిల్లులు, రవాణా, గన్నీ సంచుల లభ్యతపై చర్చించారు. ధాన్యం నిల్వకు అవసరమైన స్థలాన్ని ముందుగానే సిద్ధం చేయాలని, తగినన్ని రవాణా వాహనాలు, గన్నీ సంచులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వాహనాల ఫిట్‌నెస్, జీపీఎస్ ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెలాఖరులోగా యాప్ ద్వారా మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ధాన్యం దిగుబడి, ప్రభుత్వ సేకరణ పరిమాణంపై వ్యవసాయ శాఖ స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతమైన కొనుగోలు, రవాణా, నిల్వ ప్రక్రియ చేపట్టాలని, కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌర సరఫరాల డీఎం రాములు, సహకార అధికారి వాల్య నాయక్, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, డబ్ల్యూసీఆర్‌ఎం దీపిక, అదనపు డీఆర్‌డీఏ చౌహాన్, ఏఎంవీఐ సుందర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.