మామిడి ఇందుకు ఎస్పీ నరసింహ ఆర్థిక చేయూత
సూర్యాపేట,(విజయక్రాంతి): పేదరికాన్ని జయించి నీట్ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల(Gandhi Medical College)లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. జిల్లాలోని పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన మామిడి అంజయ్య, ప్రసన్న దంపతుల కుమార్తె ఇందు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అంగవైకల్యాన్ని అధిగమించి ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఈ పేద విద్యార్థిని కష్టాలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సూర్యాపేట జిల్లా(Suryapet District) ఎస్పీ కె. నరసింహ మానవతాదృక్పథంతో స్పందించి, తన కార్యాలయంలో ఆమెకు ఇరువై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దివ్యాంగుడైన తండ్రి తాత్కాలిక పనులు చేస్తూ, తల్లి దినసరి కూలీగా కష్టపడుతున్నప్పటికీ పట్టుదలతో చదివి ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి నిరుపేదలకు సేవ చేయాలని ఆకాంక్షించిన ఆయన, ఆ విద్యార్థిని చదువుకు భవిష్యత్తులోనూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక శాఖ నిపుణులు రామారావు మరియు పోలీసు సంక్షేమ అధికారి సాయిరాం పాల్గొన్నారు.