ఐక్యత, సమగ్రతకు పటేల్ కృషి స్ఫూర్తిదాయకం
జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి
ఐడీఓసీలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం
భూపాలపల్లి,(విజయక్రాంతి): ఐక్యత, సమగ్రతకు పటేల్ కృషి స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి(District Revenue Officer Vasantha Kumari) అన్నారు. భారతదేశ ఉక్కు మనిషి, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి(Sardar Patel 151st Birth Anniversary)ని పురస్కరించుకుని శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం డీఆర్వో మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం దేశంలోని అన్ని సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి దేశ ఐక్యత, సమగ్రతకు బలమైన పునాది వేసిన మహనీయుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి, చూపిన దూరదృష్టి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అనంతరం అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.