సర్దార్ పటేల్‌కు బీజేపీ నాయకుల ఘన నివాళులు
ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district) ఆలేరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి(Vallabhbhai Patel 151st birth anniversary) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు నందగంగేష్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నడియాడ్ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel), న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగారని తెలిపారు.
మహాత్మా గాంధీ పిలుపుతో న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఉన్న 560కి పైగా సంస్థానాలను అప్పటి హోంమంత్రి, ఉప ప్రధానిగా తన రాజకీయ చతురతతో వి.పి. మీనన్ సహకారంతో భారతదేశంలో విలీనం చేసి దేశ ఐక్యతకు పునాది వేశారని కొనియాడారు. దేశాన్ని ఏకం చేసిన మహనీయుడిగా, 'భారత ఉక్కు మనిషి'గా సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
ఆయన సేవలకు గుర్తుగా 2014 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఎలగల వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కారీకృష్ణ, 5వ వార్డు కౌన్సిలర్ పాషికంటి సంపత్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వడ్డేమాన్ నరేందర్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు బందేలా సుభాష్, మాజీ పట్టణ అధ్యక్షుడు బడుగు జహంగీర్, జిల్లా ఓబీసీ నాయకుడు ఎగిరి సంపత్, జిల్లా కిసాన్ మోర్చా నాయకుడు కంతుల శంకర్, జిల్లా మైనార్టీ నాయకుడు ఎం.డి. మక్సూద్, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు బీజని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.