బొగ్గు ఉత్పత్తి పెంపుపై ఫోకస్!
01-10-2026 | 01:16pm
సెప్టెంబర్ నెల ఉత్పత్తి, రవాణా వివరాలు వెల్లడించిన జీఎం
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 01 (విజయక్రాంతి): సింగరేణి భూపాలపల్లి ఏరియాలో సంస్థ నిర్దేశించిన లక్ష్యం ప్రకారం బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఉత్పత్తి, రవాణా వివరాలను జీఎం గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 3.84 లక్షల టన్నులు కాగా, 2.25 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 58 శాతం ప్రగతి నమోదు చేసినట్లు తెలిపారు. రోజువారీ సగటు 7,486 టన్నులుగా సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ANNUAL OPERATION PLAN) ప్రకారం అక్టోబర్ నెల లక్ష్యం 3.88 లక్షల టన్నులు కాగా, ఓపెన్ కాస్ట్ ఓసీపీ–2, 3లో ఓబీ రిమూవల్ 42.75 ఎల్‌బీసీఎంగా ఉందని పేర్కొన్నారు.
అధికారులు, ఉద్యోగులు ఉత్పత్తి పెంపు లక్ష్యాలను సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచడానికి సమన్వయంతో కూడిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గైర్హాజరు శాతం తగ్గించడం ద్వారా ఉత్పత్తి స్థాయిని గణనీయంగా పెంచవచ్చని, ఆ దిశగా కార్మికులకు నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ప్రతి ఉద్యోగి, కార్మికుడు తప్పనిసరిగా వర్కింగ్ పర్మిషన్ సహా అన్ని భద్రతా నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని, రక్షణ విషయంలో ఎటువంటి రాజీ లేదని జీఎం స్పష్టం చేశారు.
బొగ్గు డిమాండ్ ఎక్కువగా ఉన్న దృష్ట్యా బొగ్గు ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఓపెన్ కాస్ట్ గనులు, బొగ్గు నిల్వ ప్రాంగణాలు, బొగ్గు రవాణాకు ఉపయోగించే రహదారులను మరమ్మతు చేసి ఎటువంటి అవరోధాలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు అధికారులు (OFFICIALS), ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని జీఎం సూచించారు. బొగ్గు రవాణా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ (MONITORING) కొనసాగించాలని, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.