కేసీఆర్ హయాంలోనే కార్మికులకు మేలు
- టీబీజికేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర
- ఎన్నికలకు సిద్ధం కావాలని సూచన
- కార్మిక సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపు
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) : సింగరేణి బొగ్గు గని కార్మికులకు(Singareni coal mine workers) కేసీఆర్(KCR) హయాంలోనే మేలు జరిగిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former Bhupalpally MLA Gandra Venkata Ramana Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీబీజికేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితల సమ్మయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(Telangana Coal Mine Workers Union) టీబీజికేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర, టీబీజికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థను పరిరక్షించడంతో పాటు కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సింగరేణి భవిష్యత్ బాగుండాలంటే కార్మికుల సమస్యలను బలంగా ప్రశ్నించే గుర్తింపు పొందిన కార్మిక సంఘం అవసరమని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని అన్నారు. ఎన్నికల నిర్వహణపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, కోర్టు తీర్పు అనంతరం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా కార్మికుల సమస్యలపై పోరాడేందుకు నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సింగరేణి సంస్థ బలోపేతం, కార్మికుల హక్కులు పరిరక్షణ, కార్మికుల భవిష్యత్తుకు భద్రత అనే అంశాలే లక్ష్యంగా టీబీజికేఎస్ కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.