డ్రగ్స్‌పై ఉక్కుపాదం
సమాచారం ఇస్తే రూ.10 వేల రివార్డు...
యువతను టార్గెట్ చేస్తున్న మాదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా
గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు
గద్వాల,(విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో మాదకద్రవ్యాల కట్టడికి అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాతో పాటు గంజాయి సాగు(marijuana cultivation)పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడకుండా విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. డ్రగ్స్ కార్యకలాపాలు, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం అందించే వారికి రూ.10 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Collector Rizwan Basha Shaikh) ప్రకటించారు.
యువతపై డ్రగ్స్ వల
డ్రగ్స్ ప్రభావం యువతపై పడకుండా కళాశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, విద్యాసంస్థల పరిసరాల్లో అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచనున్నారు. ఆయా ప్రాంతాల్లోని దుకాణాలు, ఇళ్ల యజమానులకు కూడా డ్రగ్స్ వినియోగం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించనున్నారు.
గంజాయి సాగుపై నిఘా
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు సమాచారం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ, పోలీస్ శాఖలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి గంజాయి సాగు ఆనవాళ్లను గుర్తించాలని నిర్ణయించారు. సాగు చేస్తున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
సరిహద్దులే కీలకం
జోగులాంబ గద్వాల జిల్లా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటంతో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు డ్రగ్స్ సరఫరా మార్గాలను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈగల్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్ సరఫరా గొలుసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.
స్టెరాయిడ్స్‌పైనా కన్ను
డ్రగ్స్‌తో పాటు కొందరు యువత స్టెరాయిడ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం రావడంతో వాటిపైనా అధికారులు దృష్టి సారించారు. జిమ్ ట్రైనర్లు, ఆర్‌ఎంపీలకు ప్రత్యేక అవగాహన కల్పించి యువత ఆరోగ్యాన్ని దెబ్బతీసే పదార్థాల వినియోగాన్ని అరికట్టాలని సూచించారు.
ప్రజలే నిఘా నేత్రం
డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకంగా మారనుంది. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు, గంజాయి సాగు లేదా డ్రగ్స్ రవాణాపై సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని యంత్రాంగం కోరుతోంది. సమాచారం ఇచ్చేవారికి రూ.10 వేల రివార్డు ప్రకటించడంతో డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేసే ప్రయత్నం మొదలైంది. యువత భవిష్యత్తును కాపాడేందుకు తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
యువత డ్రగ్స్ బారిన పడకుండా ముందస్తు చర్యలు అవసరం: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
యువత డ్రగ్స్ బారిన పడకుండా ముందస్తు చర్యలు అవసరం. విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. డ్రగ్స్ కార్యకలాపాలపై సమాచారం అందించే పౌరులకు రూ.10 వేల నగదు బహుమతి అందిస్తాం. జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు జరగకుండా పోలీస్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలి.
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ సరఫరాను పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యం: ఎస్పీ శ్రీనివాసరావు
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ సరఫరాను పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యం. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు విస్తృతం చేస్తాం. గంజాయి సాగుపై కూడా నిఘా పెంచుతున్నాం. పోలీసులతో పాటు ఇతర శాఖల సమన్వయంతో డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేస్తాం.