విద్యుత్ కోతలపై రైతుల కన్నెర్ర
కామారెడ్డి జిల్లాలో రోడ్డెక్కిన రైతులు
ట్రాన్స్కో అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం
రహదారిపై ఆందోళనలతో ట్రాఫిక్ జామ్
కామారెడ్డి,(విజయక్రాంతి): విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) పాల్వంచ మండలం ఆరేపల్లి రైతులు, లింగంపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి కామారెడ్డి రహదారిపై రైతులు రోడ్డుపై బైఠా యించి ఆందోళన చేపట్టారు. పాల్వంచ వద్ద సిరిసిల్ల- కామారెడ్డి రహదారిపై ఆరేపల్లి గ్రామ రైతులు(Farmers ) ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కరెంటు సక్రమంగా రావడం లేదని పంటలు ఎండుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరు వల్లే విద్యుత్ కోతలు(power cuts) విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండడంతో దిగుబడి సరిగా రాదని తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. విద్యుత్ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించమని రైతులు పేర్కొన్నారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు డి.ఈ, ఏ ఈ లు రైతుల ఆందోళన వద్దకు వచ్చి గురువారం నుంచి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.