అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి
09-09-2026 | 07:50pm
పశువైద్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పశుసంవర్ధకాధికారి
పాపన్నపేట: పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు పశుపోషకులకు చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి ఆదిత్య వర్మ సూచించారు. బుధవారం ఆయన పాపన్నపేట(Papannapet)లోని పశువైద్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పశు వైద్య సేవల(Veterinary services)పై ఆరా తీశారు. అనంతరం మండల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పశువైద్య సేవలను సమర్ధవంతంగా అందించడంతోపాటు టీకాల కార్యక్రమం పటిష్టంగా అమలు పరచడం, పశువైద్య శిబిరాల నిర్వహణ, కృత్రిమ గర్భాధారణ కార్యక్రమం, వాటి ఆన్లైన్ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.