అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
ఎంపీ సురేష్ శెట్కార్ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేతలు..
మృతదేహం తెప్పించేందుకు కృషి..
బాన్సువాడ (విజయక్రాంతి): రష్యాలో బలవంతంగా ఆర్మీలో చేర్చబడి మృతి చెందాడని సమాచారం వచ్చిన ఎండి అఫ్జల్ ఖాన్ కుటుంబాన్ని మంగళవారం ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజ్(Kasula Balaraj) ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం పరామర్శించింది. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన అఫ్జల్ ఖాన్ గత ఫిబ్రవరి నెలలో వర్క్ వీసాపై రష్యాకు వెళ్లాడు. అక్కడ అతనితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో ముగ్గురిని రష్యా అధికారులు బలవంతంగా ఆర్మీలో చేర్పించారు.
10 రోజుల క్రితం అతనితో పాటు ఉన్న అశోక్ అనే వ్యక్తి వాయిస్ మెసేజ్ ద్వారా అఫ్జల్ ఖాన్ చనిపోయాడని చెప్పడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. అధికారిక సమాచారం లేకపోవడంతో కుటుంబం ఆందోళన చెందుతోంది. దీంతో కాసుల బాలరాజ్ బాధితుడి తండ్రి అబ్బాస్ ఖాన్ కు ధైర్యం చెప్పి, వెంటనే జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్(MP Suresh Shetkar)కు ఫోన్లో విషయం తెలిపారు. ఎంపీ స్పందిస్తూ తాను ఢిల్లీలో ఉన్నానని, ఇండియన్ ఎంబసీ ద్వారా సమాచారం రాబట్టి, మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అలీబిన్ అబ్దుల్లా, ఏజాజ్, ఖాలీద్, వహాబ్, తాడ్కల్ సర్పంచ్ రమేష్ గోపాల్ రెడ్డి, బాబా గౌస్, కో ఆప్షన్ మోయిన్, అజీమ్ పాల్గొన్నారు.