తెలంగాణ సంస్కృతి - మన వారసత్వం
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కలెక్టరేట్లో డిఆర్డి ఏ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
కామారెడ్డి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కలెక్టరేట్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Ashish Sangwan) పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, బతుకమ్మ ఆటలను ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆటల్లో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు. ఇటువంటి వేడుకలు మహిళల్లో ఐక్యతను, పరస్పర స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాలకు జిల్లా కలెక్టర్ జ్ఞాపికలను అందజేశారు. ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించిన బతుకమ్మల రూపకర్తలను అభినందించి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీఆర్డీఏ అధికారి దామోదర్ రెడ్డి, అదనపు డీఆర్డీఏ అధికారి విజయలక్ష్మి, వెంకటేష్, టీజీవో అధ్యక్షుడు దేవేందర్, టీజీవో కార్యదర్శి సాయిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.