సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య
భర్తతో కలిసి పనిమనిషి హంతకురాలు
8 తులాల బంగారు నగలు, సెల్ ఫోన్ స్వాధీనం
వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ ని చేదించిన పోలీసులు
హత్యకు పాల్పడిన భార్య, భర్తల అరెస్టు, రిమాండ్
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి(Kamareddy) పట్టణంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసు(Elderly woman murder case)ను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇంట్లో పనిమనిషి భర్తతో కలిసి వృద్ధురాలిని హత్య చేసి దోపిడీకి పాల్పడ్డారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వృద్ధురాలి హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని ముష్రిబ్ బాగ్ కాలనీలో నివాసం ఉంటున్న చిట్టి మెల్లి అనసూయ (66) ఈనెల 6న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఆమె మెడలో ఉన్న ఎనిమిది తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు.
ఈ విషయాన్ని వృద్ధురాలి కుటుంబ సభ్యులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ ఆధ్వర్యంలో సీఐ నరహరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక తను ఉపయోగించి ఇంట్లో పనిచేసే మహిళ తన భర్తతో కలిసి పథకం ప్రకారం అనసూయ ను హత్య చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసులను చోరీ చేసి పరారైనట్లు గుర్తించారు. కామారెడ్డి బతుకమ్మ కుంట కాలనీలో నివాసం ఉంటున్నబోసు రజిత, ఆమె భర్త బోసు నర్సింగ్ లు కలిసి వృద్ధురాలు అనసూయ మెడలో ఉన్న నగలను దోచుకోవాలని పథకం ప్రకారం భార్య భర్తలు ఇద్దరు కలిసి హత్య చేసి నగలను ఎత్తుకెళ్లారు. వృద్ధురాలు గుర్తు పడుతుందని భయంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
అనసూయ పూజ చేస్తున్న సమయంలో కరెంట్ ఆప్ చేసి ఆమెను మరో గదిలోకి లాగి తువ్వాలతో గొంతు నులిమి హత్య చేసి నగలను ఎత్తుకెళ్లారు. అనంతరం మరుసటి రోజు ఇంటి వారికి అనుమానం రాకుండా బోసు రజిత యధావిధిగా పనికి వచ్చింది. పోలీస్ ప్రత్యేక బృందం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా గాంధీ గంజ్ పాఠశాల సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న రజితను, ఆమె భర్త నర్సింగును అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.
వారి వద్ద నుంచి ఎనిమిది తులాల బంగారు నగలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ ల విచారణలో రజిత 2023 సంవత్సరంలో కామారెడ్డి లోని భూమయ్య ఇంట్లో పనిచేసే సమయంలో నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు గొలుసు, ఐదు గ్రాముల చెవి కమ్మలు దొంగిలించినట్లు విచారణలో తేలింది అన్నారు. వృద్ధురాలి హత్య కేసును చేదించిన డి.ఎస్.పి మధుసూదన్, పట్టణ సిఐ నరహరి, పోలీస్ సిబ్బంది రంగారావు, రామస్వామి, రాజు నాయక్, సంపత్ లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.