టీటీడీ చైర్మన్‌కు ఘన స్వాగతం.. సన్మానం

12-10-2026 | 11:21pm

శ్రీవారి ఆలయంతోపాటు కల్యాణ మండపాన్ని అభివృద్ధి చేయాలి

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు విజ్ఞప్తి

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాకు విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి చైర్మన్‌ బీఆర్‌ నాయుడి(TTD Chairman B.R. Naidu)కి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అభినందనలు తెలియజేసి, ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం(Venkateswara Swamy Temple)తోపాటు, నగరంలోని పాత టీటీడీ కల్యాణ మండపం అభివృద్ధిపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్‌కు అందజేశారు.

ఖమ్మం నగరంలోని అల్లీపురం ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో నూతన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నగరంలోని పాత టీటీడీ కల్యాణ మండపం పరిస్థితిని నెల్లూరి కోటేశ్వరరావు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కల్యాణ మండపం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నందున దాని అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలి

కల్యాణ మండపానికి అవసరమైన నిధులు కేటాయించి, భవనాన్ని ఆధునిక వసతులతో పునరుద్ధరించాలని కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు స్థానిక ప్రజలకు ఈ మండపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. భవనాన్ని ఆధునికీకరించి, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు టీటీడీ ఆస్తి సద్వినియోగమవుతుందని వివరించారు.

కల్యాణ మండపానికి సంబంధించిన భూమిలో కొంతభాగాన్ని ఆక్రమించి కొందరు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరిపించాలని కోటేశ్వరరావు కోరారు. సంబంధిత భూములకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్ , జిల్లా ఉపాధ్యక్షులు వీరెల్లి రాజేష్ ,  భద్రం ,అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, మోర్చా అధ్యక్షులు ఆర్ వి ఎస్ యాదవ్ ,మంద సరస్వతి ,శాసనాల సాయిరాం, కొనతం లక్ష్మీనారాయణ , శ్రీరామనేని మనీ, మారుతి వీరభద్ర ప్రసాద్ లక్ష్మీరెడ్డి గాడిలా నరేష్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు