ఆర్.ఎం.పి వైద్యులతో పాటు బాబాలను నమ్మి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు
జిల్లా కలెక్టర్ రాజర్శి షా..
ఉట్నూర్, అక్టోబర్ 29( విజయక్రాంతి ): ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుంటేనే అన్ని రంగాల్లో రాణించగలుగుతామని, అనారోగ్యానికి గురైన సమయంలో ఆర్ఎంపి వైద్యులతో పాటు బాబాలతోపాటు పకీర్ల వద్దకు వెళ్లి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ రాజర్శి షా(District Collector Rajarshi Shah) రోగులకు హితబోధ చేశారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వనవాసి కళ్యాణ్ పరిషత్, శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరానికి హాజరయ్యారు. గత వారం రోజుల నుండి నేత్ర పరీక్షలు నిర్వహించడం
అభినందనీయమన్నారు. మరో మూడు రోజులపాటు నేత్ర వైద్య శిబిరంలో మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి నేత్ర పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశారు. అదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు చిన్న పార్టీ జ్వరం, తలనొప్పి వచ్చిన వెంటనే ఆర్ఎంపి వైద్యులను సంప్రదిస్తున్నారని, ఆర్ఎంపి వైద్యులతో పాటు బాబాలను, ఫకీర్లను ఆశ్రయిస్తూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్.ఎం.పి వైద్యులు కేవలం ప్రథమ చికిత్స చేసి సర్కారు దావకానాలకు పంపించవలసి ఉండగా, ఆర్ఎంపీ వైద్యులు వైద్యం పేరుతో డబ్బులను దండుకోవడంతోపాటు ప్రజల ఆరోగ్యం చెడిపోయే విధంగా అధిక మోతాదులో ఇంజక్షన్లు చేయడం వల్ల చాలామంది ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని గుర్తు చేశారు.
ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చేందుకు జిల్లా నుంచి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని, త్వరలో ప్రభుత్వం నుండి అనుమతి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీవో మంద మకరందు మాట్లాడుతూ... స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఈ ప్రాంత గిరిజనులకు కార్పొరేట్ వైద్యం అందించాలని సూచనలు చేశారు.
ఏజెన్సీ ప్రాంతంలో నేత్ర వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్లూరు సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో మహేందర్, ఎంపీ ఓ సంజీవరావు, సర్పంచ్ మోహన్ సింగ్ రాథోడ్,వనవాసి కళ్యాణ పరిషత్ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు హెచ్ కే నాగు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ భీమ్రావు ఉమ్మడి జిల్లా నుండి నేత్ర పరీక్షలకు వచ్చిన రోగులు పాల్గొన్నారు.
కొమరం భీమ్ కు ఘన నివాళులు..
ఈనెల 23న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించిన కొమరం భీం విగ్రహం కు జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.