మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, (విజయక్రాంతి) : జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టి మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) కోరారు. సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి నార్కో కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాలలో పోస్టర్లు, ర్యాలీలు, అవగాహన సదస్సుల ద్వారా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి సారిస్తూ మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, సాగును అరికట్టేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అనుమానితుల కార్యకలాపాలపై నిఘా పెంచి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
డి.సి.పి. మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 8 కిలోల 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, 152 మందిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి మొక్కల సాగుకు సంబంధించి 20 లైవ్ ప్లాంట్ కేసులు నమోదు కాగా, 156 మంది అనుమానితుల జాబితాను సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారికి అవసరమైన కౌన్సెలింగ్, వైద్య చికిత్స, పునరావాస సేవలు అందించాలని, యువత భవిష్యత్తును కాపాడేందుకు అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మంచిర్యాల జిల్లా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమ సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సభ్య కార్యదర్శి, ఆర్ & బి, జాతీయ రహదారుల శాఖ, పోలీసు, ట్రాఫిక్, రవాణా, రెవెన్యూ, మున్సిపల్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖల అధికారులు, వైద్యాధికారులు డా. సునీల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.