నవంబర్ 5న కరీంనగర్ లో మహా ర్యాలీ
- దేశమంతా చర్చ జరిగేలా వేలాది మందితో వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహిస్తాం
- సర్ పేరిట కాంగ్రెస్, విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొడదాం
- కరపత్రాల రూపంలో ప్రజలకు వాస్తవాలు చెబుదాం
- కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి
ముకరంపుర, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ‘సర్’ పేరుతో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కూల్చి విదేశీ శక్తులతో కలిసి దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు కాంగ్రెస్, సీజేపీ, ఆప్ సహా చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఈనెల 5న కరీంనగర్ లో “ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అరాచకత్వాన్ని అంతం చేద్దాం” పేరిట భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో వేలాది మందితో ‘మహా ర్యాలీ’ నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) వెల్లడించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావుతో పాటు జాతీయ ప్రతినిధులు కూడా ఈ ర్యాలీకి హాజరవుతారని తెలిపారు. దేశమంతా చర్చ జరిగేలా వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం కరీంనగర్ లో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, మండల ఇంఛార్జీలు సహా ముఖ్య నేతలు హాజరైన ఈ సమావేశానికి కేంద్ర మంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీరెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ సీనియర్ నేతలు కోమాల ఆంజనేయులు, నల్లాల ఓదెలు, చెన్నమనేని వికాస్ రావు, మోహన్ రెడ్డి, గంగాడి క్రిష్ణారెడ్డి, బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ర్యాలీ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారంటూ కాంగ్రెస్, విపక్ష కూటమి నేతలు విష ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయి.
ఈ 13 కోట్లలో సుమారు 2.8 కోట్ల మంది మరణించారు. దాదాపు 3 కోట్ల మంది క్షేత్రస్థాయి పరిశీలనలో అడ్రస్‌లలో అందుబాటులో లేరు. 6.3 కోట్ల మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మరో కోటి మంది ఓటర్ల పేర్లు రెండు, మూడు చోట్ల ఓటర్ లిస్టులో నమోదు చేసుకున్నారు. చనిపోయిన ఓటర్లను ఓటర్ జాబితా నుండి తొలగించాలా? వద్దా? అంతెందుకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చనిపోయి ఏళ్లు దాటినా ఇంకా ఓటర్ జాబితాలో ఆయన పేరుంది. సర్ ప్రక్రియలో భాగంగా ఆయన పేరును తొలగించారు ఇందులో తప్పేముంది? అట్లాగే డూప్లికేట్ ఓట్లను తొలగిస్తే రాద్దాంతం ఎందుకు? అట్లాగే విదేశాల నుండి అక్రమంగా వలస వచ్చి ఓటర్లుగా నమోదైన రోహింగ్యాల ఓట్లను తొలగిస్తే తప్పేముంది?
వాస్తవానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీలు హైదరాబాద్ లో రోహింగ్యాల ఓట్లతోనే గెలుస్తూ వస్తున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపు 40 వేలకు పైగా రోహింగ్యాలు ఓటర్లుగా నమోదై బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించాయి. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ సైతం రోహింగ్యాలు, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి ఓట్లతోనే గెలుస్తూ వస్తోంది. నాటి కేసీఆర్ ప్రభుత్వంతో
పాటు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రోహింగ్యాలకు రేషన్ కార్డు, ఇండ్లుసహా ప్రభుత్వ పథకాల లబ్ది కల్పించాయి. అర్హులైన ఇతర ఓటర్లకు అన్యాయం చేశాయి. సర్ ప్రక్రియలో భాగంగా రోహింగ్యాల ఓట్లను ఎన్నికల సంఘం తొలగిస్తుంటే ఆయా పార్టీలు తట్టుకోలేక మోదీ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయి.ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనే శక్తి లేక కాంగ్రెస్ కూటమి ఈ కుట్రలకు సిద్ధమైంది. విపక్షాల కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ఈనెల 5న కరీంనగర్ లో ‘లోక్ తంత్ర బచావో-అరాచకత హఠావో’ పేరిట వేలాది మందితో దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా మహా ర్యాలీ నిర్వహిద్దాం.
కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులతో పాటు విద్యార్థులు, యువత, లాయర్లు, ఇంజనీర్లు, మేధావులు, డాక్టర్లుసహా అన్ని వర్గాల ప్రజలను ఈ ర్యాలీలో భాగస్వాములను చేద్దాం. కరపత్రాలు రూపొందించి ఇంటింటికీ పంపి ప్రజలను చైతన్యం చేద్దాం.ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లవారీగా సమావేశాలు నిర్వహించి మహా ర్యాలీకి హాజరయ్యేలా ఏర్పాట్లు చేయండి. వారికి అవసరమైన రవాణా, వసతి సౌకర్యాలను కల్పించండి. వినూత్న రీతిలో కనీవినీ ఎరగని విధంగా మహా ర్యాలీ నిర్వహించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేద్దాం అన్నారు.