అభివృద్ధి పనులను ప్రారంభించిన బండి సంజయ్
ముకరంపుర,(విజయ క్రాంతి): కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి డివిజన్ లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ లోని 42వ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించి, పలు నూతన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
భగత్ నగర్ లోని మమత థియేటర్ ఎదురుగా సిఎస్ఆర్ నిధుల సహాయంతో, మలయప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధునిక ఓపెన్ జిమ్ ను మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి- నగర డిప్యూటీ మేయర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు లతో కలిసి ప్రారంభించారు. అనంతరం రూ 60లక్షల యుఐడిఎఫ్ నిధులతో భగత్ నగర్ లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను, సీసీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, కాలనీల్లో నిలిచిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ నగరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మరియు కార్పొరేటర్లు, బిజెపి నాయకులు, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.