గిరిజనుల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం

16-09-2026 | 07:25pm

* మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది

* బిఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు చేసింది శూన్యం

* మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి 

భూత్పూర్, సెప్టెంబర్ 16: గిరిజనుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి(Municipal Chairman Mudavath Balakoti) అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ బాలకోటి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం ఓట్ల కోసం తప్ప గిరిజనులకు చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గిరిజనులకు చేసింది ఏమిటని ఆయన ప్రశ్నించారు.  ఇందిరా గాంధీ ఎస్టీలను గుర్తించి ఆనాటి నుంచే గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.

మండలంలోని  గెండ్య తండాకు  గిరిజనులు నడవడానికి బాట కూడా లేకుండేదని దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకొని పోగా ఆయన వెంటనే స్పందించి ఆ తాండకు బీటీ రోడ్డును వేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఎస్టిలకు ఏ ఒక్క స్థానమైన పదేళ్లలో కేటాయించారా అని ఆయన ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఎస్టీలను గుర్తించి మున్సిపాలిటీలో ఐదు సీట్లు ఎస్టీలకు  కేటాయించారన్నారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో  గిరిజనులను అణగదొక్కటమే చూశారు కానీ వారి అభివృద్ధి కోసం ఏ ఒక్క పదవి నైనా కట్టబెట్టారా అన్నారు. మాజీ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు పదో వార్డు నుంచి నిలబడి గెలిచిన వార్డుకు ఒక్క పని కూడా చేయలేదని దీన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ నెల 17న కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని టిఆర్ఎస్ పార్టీ చెబుతుందని కెసిఆర్ గిరిజనుల కోసం ఏం అభివృద్ధి చేశారని ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం ఎందుకు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో బంజారా భవన్ కు ఒక లక్ష కూడా ఇవ్వలేదని, అభివృద్ధి చేశామని మాట్లాడడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బంజారా భవన్ లకు రూ. 25 లక్షలు కేటాయించామన్నారు.

దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడానికి మా ఎమ్మెల్యే జిఎంఆర్ ఎల్లప్పుడూ ముందుండి  అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.  గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీకి ఒక సొంత భవనం కూడా నిర్మించలేదని, మా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో నూతన మున్సిపాలిటీ భవనానికి నమూనాను ఏర్పాటు చేశామని, త్వరలోనే శంకుస్థాపనలు కూడా చేస్తామన్నారు. మరో  20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లాలూ నాయక్, చంద్రకళ, లత సూరన్న గారి, పద్మ, సర్పంచులు తారు నాయక్, సుశీల, వెంకటేష్, మాస గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్యానాయక్, బోరింగ్ నర్సింలు, శ్రీదేవి,  పవన్ తో పాటు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు