అందని ద్రాక్ష.. సీతాఫలం?

24-10-2026 | 05:00am

ఎల్ నినో ఎఫెక్ట్‌తో తగ్గిన దిగుబడి

మార్కెట్‌లో భగ్గుమంటున్న ధరలు

హుజురాబాద్, అక్టోబర్ 2౩ (విజయక్రాంతి): ఒకప్పుడు పేద, మధ్యతరగతి ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే సీతాఫలం(Custard Apple) నేడు అందని ద్రాక్షగా మారుతోంది. తెలంగాణ ఆపిల్గా పేరుగాంచిన సీతాఫలం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులు కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. గతంలో గుట్టలు, అడవులు, పొలాల గట్ల వెంట ఎక్కడ చూసినా సీతాఫలం చెట్లు కనిపించేవి. చెట్లకు కాసిన పండ్లను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా కోసుకుని తినేవారు. రూపాయలకే చేతినిండా పండ్లు లభించేవి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఎల్ నినో ప్రభావంతో దిగుబడిపై దెబ్బ..

ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో సీతాఫలం చెట్ల పెరుగుదల, కాపుపై ప్రభావం పడుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెట్లు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, పండ్ల దిగుబడి తగ్గడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. మరోవైపు గుట్టలు, అడవుల విస్తీర్ణం తగ్గడం, సహజంగా పెరిగే సీతాఫలం చెట్లను సంరక్షించకపోవడంతో గతంలో మాదిరిగా పండ్లు విరివిగా లభించడం లేదు.

గతంలో గుట్టల నిండా పండ్లు.. నేడు మార్కెట్లో ధరల మంట!

గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సీతాఫలం చెట్లు విరివిగా కనిపించేవి. గుట్టలు, అడవుల వెంట వెళ్తే చాలు చెట్లకు గుత్తులు గుత్తులుగా పండ్లు వేలాడుతూ కనిపించేవి. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, పొలం పనులకు వెళ్లే రైతులు సైతం చెట్ల నుంచి పండ్లను కోసుకుని తినేవారు. పేదవాడికి సైతం అందుబాటులో ఉండే ఈ పండు అప్పట్లో ఎంతోమందికి ఇష్టమైన ఆహారంగా ఉండేది. కానీ ప్రస్తుతం మార్కెట్లో సీతాఫలాల ధరలు పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. పండ్లు కొనాలంటే ధర చూసి వెనకడుగు వేస్తున్నారు.

ప్రకృతి సంపదను కాపాడుకోవాలి..

ఒకప్పుడు ప్రకృతి సహజంగా అందించిన సీతాఫలం నేడు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుండటంపై గ్రామీణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీతాఫలం చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు గుట్టలు, అడవుల్లో ఉన్న సహజసిద్ధమైన చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. సంబంధిత అధికారులు కూడా అటవీ ఫలవృక్షాల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఒకప్పుడు గుట్టలపై ఉచితంగా లభించిన సీతాఫలం.. నేడు మార్కెట్లో ధర చూసి కొనాల్సిన పరిస్థితి రావడం కాలమాన పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది. పేదవాడి పండుగా పేరొందిన తెలంగాణ ఆపిల్.. నేడు పేదవాడికి అందని ద్రాక్షగా మారడం గమనార్హం.

మరిన్ని వార్తలు