అగ్నిమాపక సిబ్బంది సంక్షేమానికి టీఎన్జీవోల అండ

26-11-2026 | 09:37pm

ముకరంపుర, నవంబర్ 26(విజయ క్రాంతి): తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ శాఖ(Civil Defence Department) కరీంనగర్ జిల్లా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక టీఎన్జీవో కార్యాలయ భవనంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికలకు ముఖ్య అతిథిగా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర అడహాక్ కమిటీ అధ్యక్షులు జి. దామోదర్ రెడ్డి,

రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. శ్రీనివాస్, పి. శ్రీనివాస్, కోశాధికారి కృష్ణ పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎం.డి. తబ్రేజ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా జి. గణేష్, జిల్లా కార్యదర్శిగా పి. శ్రీధర్ రెడ్డి, జిల్లా కోశాధికారిగా వి. శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అగ్నిమాపక శాఖ ఉద్యోగుల సేవలు అత్యంత విలువైనవని అన్నారు.

అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ఉద్యోగపరంగా ఏవైనా సమస్యలు, న్యాయమైన డిమాండ్లు ఉంటే వాటిని తమ దృష్టికి తేవాలని సూచించారు.

అగ్నిమాపక శాఖ ఉద్యోగులు కూడా రాష్ట్ర ఉద్యోగుల జేఏసీలో భాగస్వాములు కావాలని, ఉద్యోగుల ఐక్యతే హక్కుల సాధనకు ప్రధాన బలమని పేర్కొన్నారు.నూతన కార్యవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శాఖలోని అన్ని స్థాయుల ఉద్యోగులను ఐక్యంగా  పారదర్శకంగా సంఘాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు