జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముకరంపుర, అక్టోబర్ 8(విజయ క్రాంతి)మోదీ కనుసన్నల్లో జరుగుతున్న ఈసీ అక్రమాలకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేసిన రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ లపై పోలీసులచే దాడి చేయించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Komati Reddy Narendra Reddy) ముకరంపుర లోని తన కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ మోదీ కనుసన్నల్లో చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ చేసిన తప్పిదాలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోలీసులచే దాడి చేపించి అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని అటువంటి ఓటు హక్కును కేంద్రం ప్రభుత్వం సీఈసీ ని అడ్డుపెట్టుకుని అన్యాయం చేస్తోందని నరేందర్ రెడ్డి అన్నారు.రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి దేశ ప్రజల పూర్తి మద్దతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఫాం 6 లో 2002 లో ఓటు హక్కు పొందిన వారి వివరాలు నమోదు చేయాలని ఉందని అప్పుడు ఓటు వేయని వారి కుటుంబాల పరిస్థితేంటని,బోగస్ ఫాం 7 ద్వారా బోగస్ సంతకాలు పెట్టి బీజేపీ నాయకులు ఓట్లు కొల్లగొడుతున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.అన్ని అక్రమాలకు జ్ఞానేశ్ కుమార్ మద్దతు ఉందని అందుకే జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇదే విధంగా కొనసాగుతే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు మేం సిద్దమని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.ఈ నిరాహార దీక్ష లో ఎండి తాజ్,కార్పోరేటర్లు వరాల నర్సింగం,పర్వతం మల్లేశం,కాంతాల జగన్ రెడ్డి,గుండాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.