కరీంనగర్ జిల్లాను టీబీ రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేద్దాం
యాదగిరి సునీల్ రావు
ముకరంపుర, అక్టోబర్ 8(విజయ క్రాంతి): కరీంనగర్ లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో(TB Mukt Bharat Abhiyaan Program) భాగంగా శుభారంభ సభ నిర్వహించబడింది. టీబీ రహిత తెలంగాణకై మరో అడుగు ముందుకు అనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Yadagiri Sunil Rao) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సునీల్ రావు మాట్లాడుతూ.. గతంలో క్షయ వ్యాధి బారిన పడిన వారిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివక్షతో చూసేవారని, వారి పట్ల భయాందోళనలు వ్యక్తమవుతుండేవని గుర్తుచేశారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల గతంలో బాధితులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉండేవన్నారు.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు ఆరోగ్య శాఖ ముమ్మర చర్యల వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితిలో గొప్ప మార్పు వచ్చిందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని మొత్తం 318 గ్రామ పంచాయతీలకు గాను, ఇప్పటికే దాదాపు 160కి పైగా గ్రామ పంచాయతీలు టీబీ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందే దిశగా అడుగులు వేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.
ఈ ఘనత సాధించడానికి అహర్నిశలు శ్రమించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి, ఏఎన్‌ఎంలకు, ఆశా కార్యకర్తలకు, మరియు స్థానిక అధికారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందజేస్తున్న టీబీ మందులు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.
ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ వైద్యశాలల్లోనే టీబీకి నాణ్యమైన చికిత్స అందుబాటులో ఉందన్నారు. బాధితులు క్రమం తప్పకుండా 6 నెలల పాటు ఈ మందులు వాడితే వ్యాధి నుండి సంపూర్ణంగా కోలుకుంటారని తెలియజేశారు.దాదాపు వంద మంది ఎన్‌సిసి క్యాడెట్లను 100 గ్రామ పంచాయతీలకు కేటాయించి,
గ్రామాల్లో టీబీ నిర్మూనకు విస్తృత అవగాహన కల్పించేందుకు బాధ్యతలు అప్పగించడం శుభ పరిణామమని తెలిపారు. ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు జోష్ టీమ్స్ ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికీ అవగాహన తీసుకెళ్లాలని సూచించారు.గ్రామ అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజల ఆరోగ్య రక్షణ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్న.
గ్రామ సర్పంచులకు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, సహాయ సహకారాలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు యాదగిరి సునీల్ రావు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి, ఎన్‌సీసీ కమాండెంట్, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్, స్థానిక సర్పంచ్‌లు, ఎంపీడీఓలు, ఎన్‌సీసీ,ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.