దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపిన క్రీడా పోటీలు
హుజురాబాద్,నవంబర్ 02:(విజయక్రాంతి): హుజురాబాద్ మండల పరిధిలోని దివ్యాంగ విద్యార్థులకు(Disabled students) సోమవారం నిర్వహించిన క్రీడా పోటీలు(Sports Competitions) ఉత్సాహభరితంగా సాగాయి. విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.
ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు. తాము కూడా అన్ని రంగాల్లో రాణించగలమనే నమ్మకాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, సహాయక ఉపకరణాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించడం విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ పోటీల్లో కుర్చీ పరుగు, రన్నింగ్, ఫ్రాగ్ జంప్, క్యారం, డ్రాయింగ్, బకెట్ ఇన్ ద బాల్ తదితర అంశాల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ డీఎం శోభారాణి, ఐఈఆర్పీ దిడ్డి జ్యోతి, స్పెషల్ ఎడ్యుకేటర్లు పైడాకుల సదయ్య, రావుల స్వాతి, ఫిజియోథెరపిస్ట్ ఐలేని స్వప్న, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, సీఆర్పీ తాళ్లపల్లి అమరేందర్, విద్యార్థుల తల్లిదండ్రులు, దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు.