చెత్త కనిపించొద్దు.. ట్రాఫిక్ ఆగొద్దు!
హైదరాబాద్: నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు. నగరంలో ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భవన నిర్మాణాలు, పార్కులు, గార్డెనింగ్ అవసరాలకు తాగునీటికి బదులుగా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సీఎం సూచించారు. జలమండలి ప్రారంభించిన గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను మరింత విస్తరించాలని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అవసరమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సిగ్నళ్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు హెచ్ఎండీఏ, మున్సిపల్ కార్పొరేషన్ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.