ట్రూ-అప్ పేరుతో రూ.5,420 కోట్ల వసూళ్లు.
ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ వినియోగదారుల(Telangana Electricity Consumers)పై మరో అదనపు భారం మోపేలా ట్రూ-అప్ చార్జీల(True-Up Charges) వసూలుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతినివ్వడాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కేంద్ర కమిటీ సభ్యులు తేజ్‌దీప్ రెడ్డి కోమటిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ మొత్తంలో రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల(Non-agricultural electricity consumers) నుంచి డిస్కమ్‌లు వసూలు చేయనున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతుందని ఆయన అన్నారు.
నవంబర్ 2026 విద్యుత్ బిల్లుల నుంచే ఈ అదనపు వసూళ్లు ప్రారంభం కానున్నాయి. మొదటి నెలలో యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాతి నెలల నుంచి యూనిట్‌కు 50 పైసలు చొప్పున ట్రూ-అప్ చార్జీలను వసూలు చేయనున్నారు. అంటే 100 యూనిట్ల విద్యుత్ వినియోగించే వినియోగదారుడికి నవంబర్‌లో సాధారణ బిల్లుకు అదనంగా రూ.30, ఆ తర్వాతి నెలల్లో రూ.50 చొప్పున అదనపు భారం పడనుంది. ఇప్పటికే విద్యుత్ బిల్లులు, నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో ట్రూ-అప్ పేరుతో మరోసారి కరెంటు బిల్లులపై భారం మోపడం సరికాదు. ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించాల్సింది పోయి అదనపు చార్జీల భారాన్ని మోపుతోంది అని తేజ్‌దీప్ రెడ్డి కోమటిరెడ్డి విమర్శించారు.
ఈ ట్రూ-అప్ వసూళ్లు ఒక్క నెలతో ముగిసేవి కావని, TGSPDCL పరిధిలో 29 నెలలు, TGNPDCL పరిధిలో 26 నెలల పాటు నిర్ణీత విధానంలో వసూలు చేయనున్నారని ఆయన తెలిపారు. దక్షిణ డిస్కమ్ పరిధిలో వినియోగదారుల నుంచి రూ.4,222.93 కోట్లు, ఉత్తర డిస్కమ్ పరిధిలో రూ.1,197.30 కోట్లు వసూలు చేయనున్నట్లు టీజీఈఆర్సీ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మొత్తం రూ.7,635.22 కోట్లలో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రైతుల నుంచి వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని టీజీఈఆర్సీ స్పష్టం చేసింది. మిగిలిన రూ.5,420.23 కోట్లను ఇతర కేటగిరీల వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం భరించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేలా చూడాలి. అదే సమయంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై మొత్తం భారాన్ని వేయడం వల్ల చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు, పరిశ్రమలకు అదనపు ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతుంది” అని తేజ్‌దీప్ రెడ్డి కోమటిరెడ్డి అన్నారు.ట్రూ-అప్ చార్జీలను సాధారణ విద్యుత్ బిల్లులో కలిపేయకుండా ప్రత్యేకంగా చూపించాలని టీజీఈఆర్సీ ఆదేశించింది. ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం, నెలవారీ వినియోగాన్ని ఎలా లెక్కించారు, ఏ రేటును వర్తింపజేశారు అనే వివరాలను బిల్లులో స్పష్టంగా చూపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రజలకు ముందుగానే పూర్తి వివరాలు తెలియజేసి, ఈ అదనపు భారాన్ని ఎందుకు మోపాల్సి వస్తుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. విద్యుత్ రంగంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు శాశ్వత పరిష్కారాలు చూపకుండా వినియోగదారుల నుంచి వసూలు చేయడం మాత్రమే మార్గంగా భావించకూడదు అని ఆయన పేర్కొన్నారు. కరెంటు బిల్లులపై ట్రూ-అప్ భారాన్ని పునఃసమీక్షించి సామాన్య వినియోగదారులపై పడే అదనపు భారం తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కేంద్ర కమిటీ సభ్యులు తేజ్‌దీప్ రెడ్డి కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.