రాజయోగ ధ్యాన పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు
రాజయోగ ధ్యానంపై తెలంగాణ పరిశోధకుల అధ్యయనానికి అంతర్జాతీయ గుర్తింపు
కొత్తపల్లి, అక్టోబర్ 16(విజయక్రాంతి): తెలంగాణకు చెందిన అట్ల శ్రీనివాస్ రెడ్డి(Atla Srinivas Reddy), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బి. రజనీ దేవి సంయుక్తంగా రూపొందించిన పరిశోధనా పత్రం 2వ అంతర్జాతీయ సైకాలజీ సదస్సు(International Psychology Conference)–2026కు ఎంపిక కావడం జరిగింది. “కౌమారదశలో మానసిక ఆరోగ్యాన్ని(Mental health) పెంపొందించేందుకు భారతీయ సంప్రదాయ ధ్యాన పద్ధతుల అన్వయం” అనే అంశంపై సాగిన ఈ పరిశోధన, రాజయోగ ధ్యానం ద్వారా పాఠశాల విద్యార్థుల భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరిచే అవకాశాలను పరిశీలిస్తుంది.
మాల్దీవ్స్లోని విల్లా కాలేజ్ క్యాంపస్లో అక్టోబర్ 18న నిర్వహించనున్న ఈ సదస్సులో పరిశోధనా పత్రాన్ని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:15 గంటలకు ఆన్లైన్లో ప్రదర్శించనున్నారు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవడంలో రాజయోగ ధ్యానం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యతకు ఎలా తోడ్పడగలదో శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ఈ పరిశోధన ప్రత్యేకత.
ఈ సందర్భంగా పరిశోధకులు మాట్లాడుతూ భారతీయ ధ్యాన సంప్రదాయాలను ఆధునిక మనోవిజ్ఞాన పరిశోధనతో అనుసంధానిస్తూ విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణకు దోహదపడటమే తమ లక్ష్యమని తెలిపారు. పరిశోధనా పత్రం అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక కావడం తెలంగాణ విద్యా, పరిశోధనా రంగాలకు ప్రోత్సాహకరమని పేర్కొన్నారు.