లక్కీ డ్రా ద్వారా బోధన్ బార్ లైసెన్స్ కేటాయింపు
బోధన్, అక్టోబర్ 16(విజయక్రాంతి) : బోధన్ పట్టణానికి నూతనంగా మంజూరైన మద్యం బార్ లైసెన్స్ కోసం శుక్రవారం కలెక్టరేట్లో(Collectorate) నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియ ఎలాంటి వివాదాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో ఈ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ కొనసాగింది. బోధన్ బార్ లైసెన్స్ను దక్కించుకునేందుకు మొత్తం 19 దరఖాస్తులు దాఖలు కాగా, దరఖాస్తుదారులందరి సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా తీశారు.
డ్రా కోసం వినియోగించిన టోకెన్లను అక్కడున్న వారందరికీ స్పష్టంగా చూపించి పారదర్శకతను చాటుకున్నారు. ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా డ్రా ప్రారంభం నుండి ముగిసే వరకు ప్రతి నిమిషాన్ని ఫొటో, వీడియో చిత్రీకరణ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, సూపరింటెండెంట్ నందగోపాల్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి, బోధన్ ఎక్సైజ్ సీఐ భాస్కర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.