తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
- మహిళలు శాసించే స్థాయికి ఎదగాలి
- రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క
ములుగు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి(Culture of Telangana), సంప్రదాయాలు, జీవన విధానం నుంచి పుట్టిన విశిష్టమైన పండుగ బతుకమ్మ అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. శుక్రవారం ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి మంత్రి బతుకమ్మ ఆడి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ స్థాయిలో ఉన్నా మన పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు.
పసుపుతో గౌరమ్మను రూపొందించి పూజించడం వంటి ఆచారాల్లో సంప్రదాయంతో పాటు శాస్త్రీయ దృక్పథం కూడా మిళితమై ఉందని పేర్కొన్నారు. అందరూ కలిసి ఆడిపాడటం వల్ల ఆనందం, పరస్పర ఆత్మీయత పెరుగుతాయన్నారు. మహిళలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన, ఆశయమని మంత్రి పేర్కొన్నారు. ఆ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా, సామాజికంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల ముఖాల్లో సంతోషం నింపేలా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని, ఐక్యతను నింపుతుందని అన్నారు. తాను మహారాష్ట్రకు చెందినప్పటికీ తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడి బతుకమ్మ, దసరా వేడుకల విశిష్టతను తెలుసుకున్నానని తెలిపారు. మహిళా అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మంత్రి సూచించిన విధంగా మరింత అంకితభావంతో పనిచేసి ప్రజలకు సేవలందిద్దామని పిలుపునిచ్చారు. అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో కార్యాలయ ప్రాంగణం పూలవనంగా మారింది. మహిళా ఉద్యోగులు బతుకమ్మ పాటలతో లయబద్ధంగా అడుగులు వేస్తూ ఉత్సాహంగా ఆడిపాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, కౌన్సిలర్లు, జిల్లా అధికారులు, మహిళా అధికారులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.