ఎల్‌నినోపై రాజకీయాలు కాదు.. ప్రజలకు అండగా నిలవాలి
ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో విమర్శలు చేయడం విచారకరం
ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లకు పెరుగుదల
నీటి సంరక్షణే కీలకం.. తాగునీటికి ప్రాధాన్యమివ్వాలి
భూగర్భ జలాలు లేని చోట్ల వ్యవసాయ మోటార్లు ఆన్ చేయొద్దు
విద్యుత్ డిమాండ్ 25 శాతం పెరిగినా నిరంతర సరఫరాకు చర్యలు
గ్రామీణ ఉపాధి కోసం 17 లక్షలకు పైగా పనుల గుర్తింపు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, అక్టోబర్ 24(విజయక్రాంతి): ప్రకృతి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు.. ప్రజలకు అండగా నిలవడమే రాజకీయ పార్టీల(political parties) బాధ్యత కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. కరోనా సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఇచ్చిన పిలుపులకు స్పందించి ప్రజలు చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడం, దీపాలు వెలిగించడం ద్వారా ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు.
ఇప్పుడు ఎల్‌నినో ప్రభావంతో(impact of El Niño) రాష్ట్రం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేసే సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం కావడం సమంజసం కాదని హితవు పలికారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే నెలల్లో తాగునీటి(Drinking water) అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా చెరువులు, కుంటలు, జలాశయాల్లో మిగిలి ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. నీటి కొరత వ్యవసాయంతో పాటు విద్యుత్ రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని, పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కొదుమూరు గ్రామంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లకు..
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 6,648 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 20,018 మెగావాట్లకు చేరిందని వివరించారు. 2023లో 15,497 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ 2025లో 17,162 మెగావాట్లకు పెరిగిందని, ప్రస్తుతం మరింత అధిక స్థాయికి చేరిందని చెప్పారు. సాధారణంగా విద్యుత్ డిమాండ్ ఏటా 6 నుంచి 6.5 శాతం పెరుగుతుండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 25 శాతం పెరుగుదల నమోదైందని పేర్కొన్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో రోజువారీ విద్యుత్ వినియోగం 245.35 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 335.05 మిలియన్ యూనిట్లకు చేరిందని తెలిపారు. ఇది సుమారు 37 శాతం పెరుగుదల అని వివరించారు. అక్టోబర్ నెలకు సంబంధించిన మరో విద్యుత్ వినియోగ గణాంకంలో 5,108 నుంచి 9,577కు పెరుగుదల నమోదైందని, ఇది 87.50 శాతమని పేర్కొన్నారు.
ఎండల తీవ్రతతో ఇళ్లలో విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు వ్యవసాయ పంపుసెట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల అవసరాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడం ఒకవైపు, ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను అంతరాయం లేకుండా ప్రజలకు చేరవేయడం మరోవైపు కీలకమని వివరించారు.
విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ
పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, వాటిలో ఇప్పటికే 177 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. మరో 267 సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
ట్రాన్స్‌కో పరిధిలో 24 సబ్‌స్టేషన్లకు అనుమతులు ఇవ్వగా, 11 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయిందని, మరో తొమ్మిది సబ్‌స్టేషన్ల పనులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. 400/220 కేవీ, 220/132 కేవీ, 132/33 కేవీ స్థాయిల్లో విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాలను విస్తరించడం వల్ల అధిక డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా వ్యవస్థను నిర్వహించగలుగుతున్నామని పేర్కొన్నారు.
నీటి కొరతతో జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం
ఎల్‌నినో కారణంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో పాటు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. సాధారణంగా రాత్రి వేళల్లో గరిష్ఠ డిమాండ్‌ను తట్టుకునేందుకు అందుబాటులో ఉండే సుమారు 3,500…