ఇలా చేయండి.. పొలీస్ కొలువు పక్కా
ఆత్మవిశ్వాసం.. నిరంతర సాధనతో పోలీస్ ఉద్యోగం సాధ్యమే
* పక్కా ప్రణాళికతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
* ప్రముఖ హిస్టరీ ఫ్యాకల్టీ డాక్టర్ అబ్దుల్ కరీం
* పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్–రైట్ ఛాయిస్ ఉచిత కోచింగ్ శిబిరంలో ప్రత్యేక బోధన
(ఖమ్మం, విజయ క్రాంతి): ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని, పక్కా ప్రణాళికతో నిరంతర సాధన చేస్తే ఎస్సై(Sub-Inspector), కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధ్యమేనని ప్రముఖ హిస్టరీ ఫ్యాకల్టీ, రచయిత డాక్టర్ అబ్దుల్ కరీం(Abdul Karim) అన్నారు. పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్–రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ శిబిరంలో మంగళవారం ఆయన అభ్యర్థులకు హిస్టరీ ప్రత్యేక తరగతులు నిర్వహించారు.
పోటీ పరీక్షల్లో చరిత్రను సులభంగా, సమర్థవంతంగా చదివేందుకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. కాలక్రమం, ముఖ్య సంఘటనలు, వాటి కారణాలు, ఫలితాలను అర్థం చేసుకుంటూ చదవాలని సూచించారు. మ్యాప్‌లు, టైమ్‌లైన్‌లను ఉపయోగించుకోవడం ద్వారా అంశాలను సులభంగా గుర్తుంచుకోవచ్చన్నారు. పోలీస్ నియామక పరీక్షల్లో చరిత్ర నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో, వాటిని ఎలా విశ్లేషించి సమాధానం ఇవ్వాలో అభ్యర్థులకు వివరించారు. ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదవడంతో పాటు ప్రతిరోజూ పునశ్చరణ, మాక్ టెస్టులు నిర్వహించుకోవాలని సూచించారు. పరీక్షకు చివరి వరకు సమయం వృథా చేయకుండా నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను పూర్తి చేసుకోవాలని తెలిపారు.
రైట్ ఛాయిస్ చైర్మన్ మెండెం కిరణ్‌కుమార్ మాట్లాడుతూ..ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో సివిల్స్ అభ్యర్థులకు తరగతులు నిర్వహిస్తున్న డాక్టర్ అబ్దుల్ కరీం సార్ ఖమ్మం వచ్చి ప్రత్యేకంగా బోధించడం అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి ఫ్యాకల్టీతో శిక్షణ అందించడంతో పాటు అభ్యర్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ ఉన్న నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ, వారి ఉద్యోగ సాధనకు ప్రోత్సాహం అందిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.