గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి..

01-11-2026 | 05:02pm
  1. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
  2. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం: మాజీ ఎంపీ నామ
  3. కేసీఆర్ పదేళ్ల పాలనలో పల్లెలు, పట్టణాల అభివృద్ధి: మాజీ ఎంపీ నామ

మధిర, నవంబర్ 1(విజయక్రాంతి): మధిర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అధ్యక్షతన ఆదివారం మధిర రూరల్, మున్సిపాలిటీ, ఎర్రుపాలెం మండలాల పార్టీ ముఖ్య నాయకులు, గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇన్‌చార్జిలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు(Former MP Nama Nageswara Rao) పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నవంబర్ 6వ తేదీలోపు పూర్తిస్థాయిలో పూర్తి చేసి విజయవంతం చేయాలని నామా సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చే ప్రతి పిలుపును నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా తీసుకుని విజయవంతం చేయాలన్నారు. పార్టీ నిర్ణయించిన కార్యాచరణకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

పార్టీ కష్టకాలంలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఓటర్లను చైతన్యపరచడం, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడం, గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేసేలా పక్కా ప్రణాళికతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లోనూ ఓటమి పాలైందని పేర్కొంటూ, తెలంగాణలోనూ ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉందని వ్యాఖ్యానించారు.

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని, రాబోయే ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో పనిచేయాలన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో విజయం చేజారినప్పటికీ ఏనుగుల రాకేష్ రెడ్డి నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజల మధ్యే ఉంటున్నారని నామ పేర్కొన్నారు.

అలాంటి నాయకుడికి రాబోయే రోజుల్లో అండగా నిలిచి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం ప్రతి ఒక్కరూ మరింత పట్టుదలతో పనిచేస్తూ మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మధిర రూరల్, మున్సిపాలిటీ, ఎర్రుపాలెం మండలాల కోఆర్డినేటర్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు బాధ్యులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు