డీజే@దద్దరిల్లుతున్న జనం!
- దుర్గాదేవి విగ్రహాల ఊరేగింపులో నిబంధనలు గాలికి..
- ప్రకటనలకే పరిమితమైన పోలీసుల హెచ్చరికలు
- ఆచరణలో కనిపించని పోలీసుల చర్యలు
కూసుమంచి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో, వివాహ, శుభకార్యాలకు, ఇతర ఎలాంటి కార్యక్రమాలకు డీజే(DJ)లను ఉపయోగించోద్దని పోలీసులు(Police) పదేపదే హెచ్చరిస్తున్నారు. పత్రిక ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోలీస్ కమీషనర్ నుంచి ఎస్ఐ వరకు అందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికి కొందరు అసలు పట్టించుకోవడం లేదు. పోలీస్ వారి హెచ్చరికలు పెడచెవిన పెడుతున్నారు. బుధవారం దుర్గాదేవి విగ్రహాల ఊరేగింపులు డీజేల హోరుతో మారుమోగాయి.
గతంలో వినాయక నిమజ్జనం సమయంలో డీజేలను ఉపయోగించిన పోలీసు, అధికారులు పట్టించుకోవడంతో డీజే నిర్వాహకులు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. డీజేల వినియోగంపై ముందస్తు హెచ్చరికలు, నిబంధనల అమలుపై ప్రచారం చేస్తున్న అధికారులు.. క్షేత్రస్థాయిలో మాత్రం వాటిని ఎంతవరకు అమలు చేయిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఊరేగింపుల్లో డీజేల శబ్దం హోరెత్తుతుంటే, నిబంధనలు అమలు చేయాల్సిన యంత్రాంగం ఏం చేస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
హెచ్చరికలు కాగితాలకే పరిమితమా? అని విమర్శిస్తున్నారు..
పండుగలు, ఊరేగింపుల, వివాహ కార్యక్రామాలకు డీజేలు పెట్టి అర్థరాత్రులు అధిక సౌండ్స్ పెట్టి డ్యాన్స్ లు చేస్తున్నారు. అసభ్యకర పాటలతో ప్రదర్శనలు చేస్తున్నారు. ఆయా సమయంలో డీజేల వినియోగంపై పోలీసులు నిబంధనలు పాటించాలని హెచ్చరించడం సాధారణంగా మారిందని, అయితే క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించడం ఒక ఎత్తయితే.. ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు వాటిని అడ్డుకోవడం మరో ఎత్తు. అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారా? లేక నిబంధనలను నిజంగానే అమలు చేస్తున్నారా? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్త మవుతున్నాయి.
డీజేల హోరుతో ప్రజలకు ఇబ్బందులు
దుర్గాదేవి విగ్రహాల ఊరేగింపుల్లో భారీ శబ్దాలతో డీజేలు వినియోగిస్తే చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. శబ్ద కాలుష్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఊరేగింపుల నిర్వహణలో పోలీసుల పర్యవేక్షణ తప్పనిసరి. అయినప్పటికీ డీజేల వినియోగంపై నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నప్పుడు అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చట్టం అందరికీ ఒకటే కాదా?
నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. ముందస్తు హెచ్చరికలు జారీ చేసి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సామాన్యుల విషయంలో నిబంధనల అమలుపై కఠినంగా వ్యవహరించే అధికారులు, పండుగ ఊరేగింపుల్లో డీజేల వినియోగం విషయంలోనూ అదే స్థాయిలో బాధ్యత చూపించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఇప్పటికైనా అధికారులు స్పందించాలి..
డీజేల వినియోగంపై అనుమతులు, వర్తించే శబ్ద పరిమితులు, సమయ నిబంధనలను పరిశీలించి ఉల్లంఘనలు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పండుగల పేరుతో నిబంధనలను పక్కన పెట్టే పరిస్థితి ఉండకూడదని, పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి తమ బాధ్యతను నిరూపించుకోవాలని అంటున్నారు. హెచ్చరికలు చేయడమే పోలీసుల విధి కాదు.. నిబంధనలు అమలయ్యేలా చూడటం కూడా వారి బాధ్యతే అని ప్రజలు పోలీసులకూ సూచనలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డీజేల వినియోగంపై స్పష్టమైన చర్యలు తీసుకుంటారా? లేక నిబంధనల ఉల్లంఘనలను చూసీచూడనట్లు వదిలేస్తారా? అనేది వేచి చూడాలి.