తలసేమియా చిన్నారులతో ఆనందోత్సాహంగా వనభోజనాలు
ప్రకృతితో మమేకమైతేనే జీవన విలువలు మెరుగుపడతాయి
ఖమ్మం టౌన్ నవంబర్ 24 విజయ క్రాంతి: తలసేమియా చిన్నారుల(Thalassemia children) ముఖాల్లో చిరునవ్వులు విరబూయించేందుకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలను ఘనంగా నిర్వహించారు. ఖమ్మం నగరంలోని గొల్లగూడెం రోడ్డులో ఉన్న చెరుకూరి వారి మామిడి తోటలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు.
సంకల్ప సంస్థ వ్యవస్థాపకురాలు పి.అనిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఆర్ ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ.. ప్రకృతితో మమేకం కావడం ద్వారా జీవన విలువలు మెరుగుపడతాయని అన్నారు. కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించడం మన సంప్రదాయమని, ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి దాని కింద భోజనాలు చేయడం విశిష్టతను చాటుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఓలివ్ క్రిప్టో సిస్టమ్స్ అధినేత జి.భారవి మాట్లాడుతూ.. సంకల్ప సంస్థతో తన ప్రయాణం 12 ఏళ్ల క్రితం ప్రారంభమైందని, చిన్నారులకు సేవలందించే కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
సంకల్ప సంస్థ వ్యవస్థాపకురాలు పి.అనిత మాట్లాడుతూ.. భారవి సహకారంతో తలసేమియా చిన్నారులకు అవసరమైన మందులతో పాటు ఐరన్ చిలేషన్ ఇంజక్షన్ల కోసం యంత్రాలను సమకూర్చుకున్నామని తెలిపారు. 12 ఏళ్లుగా సంస్థకు అండగా నిలుస్తూ, చిన్నారుల కోసం రక్తనిధి ఏర్పాటుకు సహకరించారని కొనియాడారు. హైదరాబాద్ కార్యాలయంలో ఉద్యోగుల ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దాతల సహకారంతోనే చిన్నారులకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నామని కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో వైద్యులు డి.నారాయణమూర్తి, ఓలివ్ క్రిప్టో సిస్టమ్స్ బాధ్యులు సుజాత, సంకల్ప సంస్థ కార్యదర్శి ప్రభాకర్, ఉపాధ్యక్షురాలు పి.పావని, ఉదయ్‌భాస్కర్, రవిచందర్, ఎన్.ఉపేందర్, కస్తూరి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.